Tapsee Pannu | హిందీ, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సి పన్ను (Tapsee Pannu) తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓవైపు అడపాదడపా సినిమాలు చేస్తూనే సామాజిక సేవలోనూ ముందుండే తాప్సీ తన భర్తతలో కలిసి మురికి వాడల్లో పర్యటించారు. వేసవిలో ఎండలు పెరిగిపోవడంతో బస్తీల్లోని పేద ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారికి తాప్సీ తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేశారు. తన భర్త మథియోస్ బోతో కలిసి పేదలకు ఫ్యాన్స్, కూలర్లు పంచారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తాప్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు తాప్సీ పన్ను. అనంతరం తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.