Tamil Nadu Firm Gives August 14 Off For Rajinikanth Film Release | సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా మరోసారి అభిమానుల్ని చుట్టేసింది. రజినీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమా ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. రజినీకాంత్ సినిమా విడుదల రోజు లీవ్ కావాలని ఉద్యోగుల మెయిల్స్ పెట్టడానికంటే ముందే తామే స్వచ్చంధంగా సెలవు ప్రకటిస్తున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ‘యునో ఆక్వా కేర్’ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆగస్ట్ 14న చెన్నైతో పాటుగా బెంగళూరు, ట్రిచి, చెంగాళపట్టు మరియు ఇతర నగరాల్లో ఉన్న సంస్థ కార్యాలయ ఉద్యోగులకు కూడా ఆగస్ట్ 14న సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేవలం సెలవు ఇవ్వడమే కాకుండా కూలీ సినిమా విడుదల నేపథ్యంలో ఉద్యోగులకు చాక్లెట్లు, ఉచితంగా కూలీ సినిమా టికెట్లు పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
రజినీకాంత్ సినిమా రంగంలో 50 వసంతాల మైలురాయిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు యునో ఆక్వా కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.









