Surender Reddy to direct AP Deputy CM Pawan Kalyan | న్యూ ఇయర్ నేపథ్యంలో పలు చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు వచ్చేశాయి. ఈ మేరకు మేకర్స్ తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం న్యూ ఇయర్ వేళ సర్ప్రైజ్ ప్రకటన వచ్చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించారు. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ నామకరణం చేసిన ‘జైత్ర రామ్ మూవీస్ బ్యానర్’ పై ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో గతంలోనే ఓ మూవీ ప్రకటించారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అది వాయిదా పడింది. తాజగా మళ్లీ ప్రకటన వచ్చింది.







