SRH vs LSG Match | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతుంది. అయితే 17 సీజన్లలో ఎన్నో బలమైన టీంలు, మరెందరో దిగ్గజ, పవర్ హిట్టర్లు అభిమానుల్ని అలరించారు. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ జరగని చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
అదే 300 స్కోర్. ఐపీఎల్ లో ఏదైనా టీం 300 స్కోర్ సాధిస్తుందా అని అనుకుంటే మొదట వినిపించే పేరు సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్ తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287 ను సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ సారి కూడా అంతకంటే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ తో బరిలోకి దిగింది.
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తొలి మ్యాచులోనే హైదరాబాద్ బ్యాటర్లు ఉప్పల్ స్టేడియంలో స్వైరవిహారం చేశారు. గురువారం లక్నో సూపర్ జయింట్స్ తో మ్యాచ్ జరగనున్న క్రమంలో ఈ మ్యాచ్ లోనైనా హైదరాబాద్ 300 స్కోర్ ను దాటుతుందా అనే చర్చ మొదలైంది. ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే, తీక్షణ, ఫజల్ హాక్ వంటి స్టార్ బౌలర్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్ పైనే హైదరాబాద్ 286 పరుగులు చేసింది.
మరి అంత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ లేని లక్నోపై హైదరాబాద్ ఆటగాళ్లు ఎలా చెలరేగి ఆడుతారో అనేది ఆసక్తి గా మారింది. శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ మినహా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్లు లేరు. తొలి మ్యాచులో ఊహించని ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న లక్నో హైదరాబాద్ పై ఎలాంటి స్ట్రాటజీ తో వస్తుందో వేచి చూడాలి.
మరోవైపు హెడ్, అభిషేక్, ఇషాన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వంటి భారీ హిట్టర్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. షమీ, హర్షల్ పటేల్, కమిన్స్, సిమర్ జీత్ సింగ్ మరియు అభిషేక్, జాంపలతో కూడిన బౌలింగ్ లైనప్ బ్యాటింగ్ కు ధీటుగా ఉంది.
అసలు హైదరాబాద్ ను ఆపడం సాధ్యమేనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మీమ్స్ వైరల్ గా మారాయి. అబ్ కి బార్ 300 పార్ అంటూ హైదరాబాద్ బ్యాటింగ్ ను ఉద్దేశిస్తూ పలువురు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.