Sajjala Counter To Sharmila | దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం చీలడానికి సీఎం జగనే కారణమంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. షర్మిల హఠాత్తుగా రాష్ట్రంలో అడుగుపెట్టి, తమపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారని అభిప్రాయ పడ్డారు. షర్మిల కు ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదని, పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
జగన్ చెల్లెలుగా, వైఎస్సార్ కూతురుగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసున్నారు. ఈ ఒక్క కారణం మూలంగానే ఆమెకు కాంగ్రెస్ పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే తనకు జగన్ ఏ రకంగా అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
కుటుంబం చీలికకు కారణం ఆయనే: షర్మిల సంచలన వ్యాఖ్యలు!
పదవుల పంపకాల్లో ఏమన్నా అన్యాయం జరిగిందా? ప్రజాస్వామ్యంలో అన్ని పదవులు ఒకే కుటుంబానికి ఇస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని ఎంత వేధించిందో షర్మిలకు తెలుసన్నారు సజ్జల.
ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీవా.. మరెందుకని బీజేపీతో కలిశామని ఆరోపణలు చేస్తారు? అంటూ నిలదీశారు. ప్లాన్ ప్రకారమే చంద్రబాబు షర్మిలను తీసుకువచ్చారని, చంద్రబాబుకు ఎంత అవసరమో షర్మిల అంతే మాట్లాడుతుందని ధ్వజమెత్తారు సజ్జల.