Revanth Reddy Had Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka | తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామ నవమి నేపథ్యంలో సీఎం కుటుంబ సమేతంగా భద్రాచలంకు వెళ్లారు.
సీతారాముల కళ్యాణంలో స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో సీఎం మరియు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ముఖ్యమంత్రి మరియు మంత్రులు భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మరియు మంత్రులు తమ ఇంటికి రావడం పట్ల శ్రీనివాస్ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.