Ram Gopal Varma hits back at the dog lovers upset over Supreme Court’s decision | దేశ రాజధాని ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని వీధి శునకాలని నగరానికి దూరంగా షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెల్సిందే.
అయితే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల పలువురు జంతు ప్రేమికులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇది జంతు హక్కులకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. వీధి కుక్కల దాడిలో మరణించిన పలువురు చిన్నారుల వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుపై అన్యాయం జరుగుతుందని రోధిస్తున్న జంతు ప్రేమికులు శునకాల దాడుల్లో చిన్నారులు మరణించినప్పుడు ఎక్కడ ఉన్నారని ఆర్జీవి నిలదీశారు. ఏటా శునకాల దాడుల్లో చిన్నారులు మరణిస్తున్నారని, మరెందరో గాయపడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో జంతు ప్రేమికులు దయా హృదయం ఏమైందని ప్రశ్నించారు.
శునకాలను ప్రేమించడంలో తప్పు లేదని, తాను కూడా ఓ జంతు ప్రేమికుడ్నే అని పేర్కొన్నారు. విలాసవంతమైన విల్లాల్లో, ఇళ్లల్లో దిగుమతి చేసుకునే శునకాలను ప్రేమించుకోవాలని సూచించారు. శునకాల మూలంగా విలాసవంతమైన ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని కానీ పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో గల్లీల్లో, చిన్నపిల్లలు సంచరించే రోడ్లపై ఈ సమస్య ఉందని నొక్కిచెప్పారు.
ఇప్పుడు కుక్కల హక్కుల గురించే వాపోతున్నవారు చిన్నారుల హక్కులను ఎందుకు విస్మరిస్తున్నారని ఆర్జీవి ఫైర్ అయ్యారు. ఒకవేళ శునకాలపై ప్రేమే ఉంటే వీధిలో ఉన్నవాటిని దత్తత తీసుకుని పెంచుకోవాలన్నారు. అంతేకాని ఇప్పుడు సుప్రీం తీర్పును వ్యతిరేకించి వీధుల్లో చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హితవుపలికారు. చిన్నారుల జీవితాల కంటే కుక్కలే అమూల్యమైనవని భావించే సమాజం ఎప్పుడో మానవత్వాన్ని కోల్పోయిందన్నారు రాంగోపాల్ వర్మ.









