Rachakonda CP Sudheer Babu | సినీ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంబంలో ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు ఆవేశంలో ఓ జర్నలిస్టుపై దాడి చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదయ్యింది.
ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీపై కేసులు, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక వ్యాఖ్యాలు చేశారు. ఈ వివాదంలో మంచు కుటుంబంపై మెుత్తం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సీపీ తెలిపారు.
డిసెంబర్ 10న జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైందని చెప్పారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుపై వారెంట్ ఇష్యూ చేసినట్లు తెలిపారు.
అయితే, విచారణకు హాజరయ్యేందుకు మోహన్ బాబు ఈనెల 24న వరకు సమయం అడిగినట్లు తెలిపారు. కోర్టు నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారని వెల్లడించారు. అందుకే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయలేదని అన్నారు.
ఈనెల 24 తర్వాత ఆయనకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. అప్పుడు ఆయన విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. లేదంటే వారెంట్ ఇష్యూ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.