AP Private Bus Fire | ఏపీలో (Andra Pradesh)ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరోసారి ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
దీంతో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు 36 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




