– జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
Republic Day At Kartavya Path | దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకలకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా హాజరు అయ్యారు. ప్రత్యేక అతిథిగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.
జాతీయ గేయం ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తి కావడం ప్రధాన థీమ్‌గా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు పాల్గొనగా, మరో 13 శకటాలు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల తరఫున ప్రదర్శించబడ్డాయి.
దేశ రక్షణ శక్తిని ప్రతిబింబించేలా త్రివిధ దళాల శకటంలో ‘ఆపరేషన్ సిందూర్’ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. గగనతల విన్యాసాల్లో 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు పాల్గొని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.









