Police and Maoists dining together | ఎప్పుడూ ఎదురుపడితే తూటాల వర్షం కురిపించుకునే పోలీసులు, మావోయిస్టులు.. ఒకే చోట కూర్చుని ఆత్మీయంగా భోజనం చేసిన అరుదైన దృశ్యం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో ఆవిష్కృతమైంది.
‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ప్రభావంతో జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం మానవత్వంతో స్వాగతం పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కుంజం రాధిక, కడియం సందీప్, పద్మ అనే ముగ్గురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.
శనివారం వారు అడవుల నుంచి కాలినడకన బయలుదేరి పార్తాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై రామేశ్వర్ చతుర్వేది తన బలగాలతో అక్కడికి చేరుకున్నారు.
సుదూర ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చిన వారు తీవ్ర ఆకలితో ఉన్నారని గుర్తించిన ఎస్సై, వెంటనే వారికి భోజన ఏర్పాట్లు చేయడమే కాకుండా.. వారితో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు.
పోలీసులు అంటే శత్రువులు కాదని, రక్షకులని చాటిచెప్పేలా ఎస్సై వ్యవహరించిన తీరు ఆ ముగ్గురు మావోయిస్టులలో కొత్త నమ్మకాన్ని నింపింది. ఎస్సై చూపిన ఆదరణతో ప్రభావితమైన ఆ ముగ్గురు ఆదివారం అధికారికంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
సాధారణంగా ఎన్కౌంటర్ వార్తలు వినే అడవి ప్రాంతంలో, ఇలా పోలీసులు-మావోయిస్టులు కలిసి భోజనం చేస్తున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. “తుపాకీ కంటే ప్రేమ గొప్పది” అంటూ ఈ దృశ్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.






