PM Narendra Modi | భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) కి మరో అరుదైన గౌరవం దక్కింది. కోవిడ్ సమయంలో తమ దేశానికి అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి ప్రకటించింది.
ఈ మేరకు డొమినికా (Dominica) ప్రధాని కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు ప్రధాని మోదీ విశేష కృషి చేసినట్లు కొనియాడారు. 2021 ఫిబ్రవరి నెలలో పీఎం మోదీ డొమినికాకు 70 వేల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపించారు.
క్లిష్ట సమయంలో ఆదుకోవడం మూలంగా తమ దేశం ఇతర దేశాలకు అండగా నిలవగలిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, మోదీ నేతృత్వంలో విద్య, వైద్యం, ఐటీ రంగంలో భారత్ తమకు ఎంతో అండగా ఉన్నట్లు డొమినికా దేశం ప్రకటించింది.
అందుకే ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు డొమినికా దేశ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉండగా వచ్చేవారం గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో ప్రధాని మోదీకి అవార్డు ప్రధానం చేయనున్నారు.