PM Modi News | ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ అధినేతగా 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. ఇలా 24 ఏళ్ల పాటు నిరంతరాయంగా మోదీ గుజరాత్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. భారతీయుల నిరంతర ఆశీస్సులతో, తాను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుయజేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు, తన తల్లి చెప్పిన మాటలను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘నీ పని గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు, కానీ నేను రెండు విషయాలు మాత్రమే కోరుకుంటాను. మొదట ఎల్లప్పుడూ పేదవారి కోసం పనిచేయాలి, రెండవది ఎప్పుడూ లంచం తీసుకోకూడదు’ అని తల్లి చెప్పినట్లు ప్రధాని పేర్కొన్నారు. అమ్మ ఆదేశాల అనుగుణంగా నేటికీ ప్రజలకు సేవ చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.









