Peddireddy Ramachandra Reddy News | చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగలంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ భూమిని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసారంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశించారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్.తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని సూచించారు.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తెలిపారు.
అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.