Origin Dairy Shejal | బెల్లంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నారని ఆరోపిస్తూ గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్న ఆరిజన్ డెయిరి (Origin Dairy) సంస్థ యజమాని శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడి సమీపంలో గురువారం ఆమె సూసైడ్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. అచేతన స్థితిలో గమనించిన ఆమెను గుర్తించి పోలీసులు వెంటనే పేస్ హాస్పిటల్ కు తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఆయుర్వేదిక్ నిద్రమాత్రలు వేసుకున్న శేజల్ (Shejal) ను మరికాసేపట్లో పేస్ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని శేజల్ ఆరోపిస్తున్నారు.
దాదాపు 15 రోజుల పాటు ఢిల్లీలో పోరాటం చేసిన ఆమె, జాతీయ మహిళ కమిషన్ కు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనతో ఢిల్లీ లో బలన్మరణానికి యత్నించారు. వెంటనే గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
డిశ్చార్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే చిన్నయ్య పైన సీబీఐ కి కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నుండి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అని శేజల్ ఆరోపించారు.
తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యే ప్రభావం వల్ల తను పెట్టిన కేసును విచారించడం లేదని ఆవేదనను వ్యక్తపరిచారు.
తెలంగాణ పోలీసులపైన నమ్మకం లేక ఢిల్లీ లో న్యాయపోరాటం చేశానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
తన దగ్గర ఉన్న ఆధారాలని ఢిల్లీలో సీబీఐ కి సమర్పించానని కానీ ఎమ్మెల్యే అనుచరులు పదే పదే తనని వేధిస్తున్నారని వాపోయారు.
వెంటనే ఎమ్మెల్యేను పదవి నుండి తప్పించి , పార్టీ నుండి తొలగించి తన లాంటి అమ్మాయిలను ఎమ్మెల్యే బారి నుండి రక్షించాలని ఆమె కోరారు.
ఎమ్మెల్యే కు ప్రభుత్వం మద్దతుగా ఉందని, అందుకే పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని సూసైడ్ నోట్ లో రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయదనీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకే వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.