Nirmala Seetaraman Budget Day Saree | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetaraman) శనివారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశ పెట్టారు. 2019 నుంచి నిర్మలా సీతారామాన్ వరుసగా 8వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అయితే ప్రతిసారి బడ్జెట్ తో పాటు గత ఏడేళ్లుగా మంత్రి ధరించే చీరలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చేనేత ప్రోత్సహించేలా ఏటా బడ్జెట్ ప్రసంగం రోజు ఆమె చేనేత చీరలు మాత్రమే ధరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్మల ధరించిన చీర కూడా వార్తల్లో నిలిచింది.
బంగారు అంచుతో చేపల ఆర్ట్ ఉన్న గోధుమవర్ణం చీర, రెడ్ కలర్ బ్లౌజ్, తెల్లని శాలువా ధరించారు. ఇది మధుబని ఆర్ట్ కి సంబంధించింది. మధుబని కళ అనేది బీహార్‌లోని మిథిలా ప్రాంతానికి చెందిన సాంప్రదాయ జానపద కళారూపం.
ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి తయారు చేశారు. మంత్రి సీతారామన్ బిహార్ లోని మధుబనికి వెళ్లినప్పుడు దులారీ దేవి తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను బహూకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలని ఆమె విజ్ఞప్తి మేరకు నిర్మలా సీతారామన్ ఈ చీరను ధరించారు.