Nimisha Priya case: ‘No pardon,’ says victim’s brother in Yemen | కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు హత్య కేసులో ఉరిశిక్ష ఖరారు అయిన విషయం తెల్సిందే.
బుధవారం ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా, దీనిని యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. నిమిష ప్రియ ఈ శిక్ష నుండి బయటపడాలంటే ఒకటే మార్గం అది ‘బ్లడ్ మనీ’. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి, వారి నుంచి క్షమాభిక్ష పొందితే నిమిష ప్రియ ఉరిశిక్ష నుండి బయటపడుతుంది.
కానీ బ్లడ్ మనీ కి బాధిత కుటుంబం అంగీకరించడం లేదు. తాజగా మృతడు తలాల్ అదిబీ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమకు బ్లడ్ మనీ అవసరం లేదని, న్యాయం జరగాలంటూ ఆయన పేర్కొన్నారు. ఉరిశిక్ష వాయిదను తమ కుటుంబం ఊహించలేదని అతడు తెలిపాడు.
అయితే నిమిష ప్రియ కుటుంబానికి, తమకు మధ్య జరుగుతున్న మధ్యవర్తిత్వం కొత్తేమి కాదని, ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని అతడు పేర్కొన్నాడు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం, మెహదీ కుటుంబానికి న్యాయం జరగాలంటే నిమిషకు శిక్ష పడాల్సిందేనని అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్టులో రాసుకొచ్చాడు.
ఇదిలా ఉండగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు యెమెన్ ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ తో చర్చలు జరిపి ఉరిశిక్షను వాయిదా వేయడంలో విజయం సాధించారు.
మరోవైపు రూ.8.6 కోట్ల క్షమాదానాన్ని ఇచ్చేందుకు నిమిష కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఈ బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు.