Newly Married Couples Controversy in Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫోటో షూట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై వివాదం చెలరేగింది. తమిళనాడు, తిరువన్నమలై చెందిన జంట బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో గొల్లమండపానికి అతి సమీపంలో ఫోటో షూట్ చేయించుకున్నారు.
వరుడు వధువు నుదిటిపై ముద్దు పెట్టుకుంటుండగా వీడియోలు, ఫొటోలు తీశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఫోటోషూట్, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ ఇలా ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఫొటో షూట్ లో పాల్గొన్న ఆ జంట స్పందించింది. ఆ ఘటనపై క్షమాపణలు కోరుతూ దంపతులు ఇద్దరూ కలిసి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. టీటీడీ కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకున్నామనీ, ఈ క్రమంలోనే గుడి ప్రాంగణంలో ఫోటోలు తీసుకున్నట్లు తెలిపారు.
అక్కడ ఫొటోలు దిగడం నిషేధం అని తమకు తెలియదని తెలిపారు. ఇకపై అలాంటి తప్పు చేయమని చెప్పారు. ఆ వీడియోలు, ఫోటోలను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. తెలియక తప్పు చేశామని, తమని క్షమించండి అని కోరారు. శ్రీవారికి సేవ చేసి తమ తప్పును సరిచేసుకుంటామని ఆ నూతన ఆవేదన వ్యక్తం చేసింది.










