Nara Lokesh News | తల్లికి వందనం పథకం కింద ఖాతాలో పడిన డబ్బులకు మరో రూ.రెండు వేలు కలిపి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల బాగు కోసం ఇచ్చారు ఓ ఆదర్శ తల్లి.
ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో తల్లికి వందనం పథకం కింద ఆ తల్లి ఖాతాలో రూ.13 వేలు పడ్డాయి. వీటికి తోడుగా మరో రూ.2 వేలు కలిపి ఆ తల్లి పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని డబ్బులను తిరిగిచ్చేశారు. ఈ మేరకు జులై 10న జరిగిన టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధీర్ కు డబ్బులను అందజేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. తల్లీ నీకు వందనం అని ఆదర్శ మాతృమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. పిల్లల చదువుకు తల్లిదండ్రుల్లా ఆలోచిస్తూ కూటమి ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోందని, తల్లికి వందనం పథకం కింద తన ఖాతాలో పడిన 13 వేలుకి మరో రెండు వేలు కలిపి 15 వేలు పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని అందించిన తల్లీ నీకు వందనం అని కృతజ్ఞతలు చెప్పారు.
విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇలాంటి వారి సహకారం తోడు కావడం చాలా సంతోషంగా ఉందని అభినందించారు.