Messi Likely to Be Face of Telangana Rising 2047 Telangana | ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు గల ఫుట్బాల్ లెజెండ్, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సి డిసెంబర్ నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా మెస్సి డిసెంబర్ 13న హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియంలో ఓ ఫ్రెండ్లీ ఫుట్బాల్ ఆడే అవకాశం ఉంది.
ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం స్వయంగా ఫుట్బాల్ కు పెద్ద అభిమాని. ఇటీవల మెస్సి భారత పర్యటనను నిర్వహిస్తున్న ‘గోట్ ఇండియా టూర్-2025’ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మెస్సి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.
మరోవైపు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 విజన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా తెలంగాణను ప్రమోట్ చేసేందుకు మెస్సితో ప్రభుత్వం ఓ ఒప్పందం చేసుకొనున్నట్లు కథనాలు వస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ కు మెస్సిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.









