Man spotted carrying cake to Delhi’s Pakistan High Commission | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మృతి చెందారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి పట్ల యావత్ దేశంలో ఆగ్రహం, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు దిగారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే పహల్గాం లో అమాయక పర్యాటకులు మరణించిన తరుణం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో మాత్రం సంబరాలు జరుపుకున్నట్లు కథనాలు బయటకు రావడం కలకలం రేపుతోంది.
గురువారం హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తుండగా, అక్కడున్న మీడియా వారు అతన్ని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, పలు అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కేక్‌ను తీసుకుని కార్యాలయంలోకి వెళ్తుండగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు గమనించారు.
ఈ కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారని, ఏ వేడుక కోసం కేకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించినప్పుడు, ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.