Flight Accident in Maharashtra| మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajith Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. బుధవారం ఉదయం బారామతిలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది.
ఈ ప్రమాద ధాటికి విమానం రెండు ముక్కలయ్యింది. అనంతరం భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబయి నుండి బారామతి బయలుదేరారు.
అజిత్ పవార్, ఇద్దరు విమాన సిబ్బంది, మరో ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది విమానంలో బయలుదేరారు. అయితే విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలోనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు మరణించారు.
తన బాబాయి, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ అడుగుజాడల్లో అజిత్ పవార్ రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి గా ఉన్నారు.









