Maha Kumbamela | ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా’ (Kumbh Mela)కు ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. ఈ కుంభమేళా పాల్గొనేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. సోమవారం మొదటి రోజు ఉదయం, సుమారు 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. నేటి నుంచి 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహా కుంభ మేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
“మహా కుంభమేళకు వచ్చే ప్రతి వ్యక్తి సగటున రూ.5వేలు ఖర్చు చేసినా, మొత్తం ఆదాయం రూ.2 లక్షల కోట్లు అవుతుంది. ఇందులో హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలు ఉన్నాయి” అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CIAT) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ అంచనా వేశారు. ప్రాంతీయ హోటళ్లతో, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక లాడ్జీల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం రావచ్చునని తెలిపారు.
ప్యాకేజీ ఆహారం, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి వస్తువులతో మరో రూ.20 వేల కోట్ల వ్యాపారం, నూనె, దీపాలు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ధూపం, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి పూజాసామగ్రితో మరో రూ.20 వేల కోట్ల లావాదేవీలు జరిగి అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రయాణికుల కోసం టాక్సీలు, సరకు రవాణా సేవలతో రూ.10 వేల కోట్లు, టూరిస్టు గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు వంటి వాటితో మరొక రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగనుంది.
మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇతర ఔషధాలతో రూ.3 వేల కోట్లు, టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో రూ.1 వేల కోట్లు, మీడియా ప్రకటనలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగనుంది.
2019లో జరిగిన ఆర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు హాజరై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.2 లక్షల కోట్లు సమకూరింది. ఈసారి, నెలన్నర పాటు సాగనున్న మహా కుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. దీంతో రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.