KTR vs CM Revanth Reddy | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. కేటీఆర్ చుట్టూ గంజాయి బ్యాచ్ ఉంటుందని, ఆయనతో ఉండేవారు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ తాను చేసిన నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేసిన అసత్యపూరిత, దురుద్దేశపూర్వక నిందలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
పిరికి దద్దమ్మలా చిట్‌చాట్‌ల పేరుతో తన వ్యక్తిత్వ హననానికి రేవంత్ పాల్పడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే దొంగ చాటుగా చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
హైదరాబాద్‌లో తనతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరీ రేవంత్ రెడ్డి తనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారం ఏమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.









