Konaseema Prabhala Theertham | డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కన్నుల పండుగగా జరుగుతోంది. అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏటా కనుమ పండుగ రోజు జరిగే ప్రభల తీర్ధానికి 476 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర ఉంది. ఈ తీర్థం జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచింది. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో కొలువుదీరి, ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారని భక్తుల విశ్వాసం. కాగా ప్రభల తీర్థం నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
476 సంవత్సరాలుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించిందన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం అని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వ పరంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఉత్సవం వైభవంగా జరగాలని, అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు.









