Komatireddy Rajgopal Reddy News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 18 వరకు టెండర్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇతర జిల్లా, నియోజకవర్గాల వారు మునుగోడులో టెండర్లు వేయొద్దని స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకే మద్యం అమ్మాలని స్పష్టం చేశారు. అలాగే మద్యం షాపులు ఊరి బయటే ఉండాలన్నారు. పర్మిట్ రూమ్ లేకుండా విక్రయాలు జరగాలన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే తన ఉద్దేశం అని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.
బెల్టు షాపులను సరఫరా చేయడం, సిండికేట్ గా మారి అధిక ధరలకు, డూప్లికేట్ మద్యాన్ని అమ్మకూడదని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలనేదే తన కోరిక అని తెలిపారు. కాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.










