Komatireddy Rajgopal Reddy News | వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తాను భేటీ అవబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోమటిరెడ్డి గుంటూరు బయలుదేరారు. ఈ నేపథ్యంలో జగన్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు, కాంగ్రెస్ నుంచి బయటకు రాబోతున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో గుంటూరు వెళ్తూ చిట్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు గిట్టని వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను జగన్ ను కలవడానికి ఏపీకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో సైతం నిజం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను కొన్ని సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసినట్లు అలా చేయడంలో తప్పేమి లేదని పేర్కొన్నారు. అవసరమైతే తన రాజకీయ భవిష్యత్ గురించి తానే ప్రకటన చేస్తానని అప్పటివరకు ఎలాంటి వదంతులు నమ్మొద్దని కోరారు.









