Kevin Warsh Nomination Triggers Gold and Silver Market Plunge | గత కొద్ది నెలలుగా ఆకాశమే హద్దుగా పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి. గత రికార్డులను చెరిపివేస్తూ పుత్తడి, వెండి రేట్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట ధరలను తాకాయి. ఇదే సమయంలో శుక్రవారం ఒక్కసారిగా ఈ విలువైన లోహాల ధరలు కుప్పకులాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న కేజీ వెండి ధర శుక్రవారం, శనివారం కలిపి ఏకంగా రూ.75 వేలకు పైగా తగ్గింది. బంగారం ధర కూడా రూ.15-20 వేల మధ్య తగ్గింది. ఇలా ఒక్కసారిగా పసిడి, వెండి ధరలు కుప్పకూలడం వెనుక కారణం ఏమై ఉండొచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మాత్రం కెవిన్ వార్ష్ పేరు వినిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా మాజీ ఫెడ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయనున్నట్లు ప్రకటించడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా మారింది.
కెవిన్ వార్ష్ గతంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను ‘ఇన్‌ఫ్లేషన్ హాక్’ అంటే కఠిన ద్రవ్య విధానాలకు మద్దతిచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు. ట్రంప్ ఒత్తిడి మేరకు వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం తగ్గిందనే అంచనాలు వచ్చాయి. దీంతో డాలర్ బలపడింది. డాలర్ బలపడటం వల్ల బంగారం, వెండి వంటి ధరలు డాలర్లలో నిర్ణయించబడటంతో విదేశీ కొనుగోలుదారులకు ఖరీదైనవిగా మారాయి. దీంతో డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి పెరిగింది. అంతేకాదు, గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఇది పతనాన్ని మరింత తీవ్రతరం చేసిందని కథనాలు వస్తున్నాయి. డాలర్ బలోపేతానికి వార్ష్ పెద్ద పీఠ వేస్తారనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయంతో భారీగా అమ్మకాలు చేపట్టడంతోనే పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.









