JubileeHills Exit Poll | బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ క్రమంలో నవంబర్ 11 న ఎన్నికలు జరిగాయి. మొత్తం 4.01లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎక్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 46 శాతం, బీఆరెస్ పార్టీకి 43 శాతం, బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్, బీఆరెస్ అభ్యర్థి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ఉంది. \
మరో సంస్థ హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 48.3 శాతం, బీఆరెస్ కు 43.18 శాతం, బీజేపీకి 5.84 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇకపోతే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం హస్తం పార్టీకి 48.2 శాతం, గులాబీ పార్టీకి 42.1 శాతం, కాషాయ పార్టీకి 7.6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.









