అయితే మీ సమస్య ఇదేనేమో వివిధ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన లోపాలు, పోషకాహార సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, కణజాల రుగ్మతలు, హెయిర్ డై దుష్ప్రభావాలు, హార్మోన్ ఇంజెక్షన్లు, లైంగిక సాంక్రమిత వ్యాధులు మొదలైన వాటివల్ల అలోపీసియా తలెత్తుతుంది.
తల మీద ఓ నిర్ణీత ప్రదేశంలో కానీ, శరీరం మొత్తం కానీ వెంట్రుకలు తీవ్రంగా రాలిపోవడాన్ని ‘అలోపీసియా’ అంటారు. ఇది రెండు రకాలు. స్కారింగ్, నాన్- స్కారింగ్. స్కారింగ్ అలోపీసియాకు చికిత్స లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ లేకుండానే తలెత్తుతుంది. కొన్నిసార్లు మాత్రం జుట్టు రాలి పోవడంతో ఈ సమస్య బయటపడుతుంది.వివిధ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన లోపాలు, పోషకాహార సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, కణజాల రుగ్మతలు, హెయిర్ డై దుష్ప్రభావాలు, హార్మోన్ ఇంజెక్షన్లు, లైంగిక సాంక్రమిత వ్యాధులు మొదలైన వాటివల్ల అలోపీసియా తలెత్తుతుంది. హార్మోన్ల విషయానికొస్తే..హైపోథైరాయిడిజం కూడా ఓ ప్రధాన కారణమే. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ కేశాలకు హానికరంగా పరిణమించవచ్చు. ఒత్తిడి ఓ పెద్ద శత్రువే. అంతేకాదు, కొవిడ్-19 తర్వాత చాలామందిలో ఈ సమస్య తీవ్రంగా మారింది. కొందరిలో మాత్రం మూడు నుంచి ఆరు నెలల్లో మళ్లీ కొత్త జుట్టు వస్తున్నది. కొన్నిసార్లు ఏడాదికిపైగా పట్టొచ్చు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
సంకేతాలు-లక్షణాలు
వెంట్రుకలు పలుచబడటం.
వృత్తాకారంలో రాలిపోయి, అతుకులు ఏర్పడటం.
తీవ్రమైన షాక్‌కు గురైనప్పుడు కూడా కేశాలు రాలిపోతాయి.
కీమోథెరపీ లాంటి చికిత్సలూ ఓ కారణమే. అయితే, ఈ పరిస్థితిలో జుట్టు సాధారణంగా దానంతట అదే మళ్లీ వస్తుంది.
తామర, వెంట్రుకలు చిట్లిపోవడం, తలలో వాపు మొదలైన వాటివల్ల జుట్టు రాలిపోయి పొలుసులా ఏర్పడుతుంది. ఈ లక్షణాల్ని జాగ్రత్తగా గమనించి, వైద్యులకు వివరించాలి.
నిర్ధారణ
రక్త పరీక్ష: జుట్టు రాలడానికి మూల కారణం తెలుసుకోవడానికి డాక్టర్లు రక్త పరీక్ష చేస్తారు.
పుల్ పరీక్ష: ఒకేసారి పెద్దమొత్తంలో ఊడిపోతుందా లేదా అని తెలుసుకోడానికి.. జుట్టు చేతితో లాగి పరీక్షిస్తారు. రాలిపోవడం ఏ దశలో ఉందనే నిర్ధారణకు సంబంధించిన పరీక్ష ఇది.
స్కాల్ప్ బయాప్సీ: వెంట్రుకలు రాలడానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణమా అని నిర్ధారించడానికి స్కాల్ప్ బయాప్సీ చేస్తారు.
లైట్ మైక్రోస్కోపీ: జుట్టు కుదుళ్లలో (హెయిర్ షాఫ్ట్) ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మైక్రోస్కోపీ పనికొస్తుంది.
మూలాల్ని బట్టి చికిత్స
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి, ఆ కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఇన్ఫెక్షన్ వల్ల అయితే వైద్యులు శక్తిమంతమైన మందులతో వైద్యం చేస్తారు. అదే హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తే.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. వీటివల్ల కూడా ప్రయోజనం కనిపించకపోతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఉత్తమం. అయితే, చాలా సందర్భాల్లో తొలిదశ చికిత్సతోనే సమస్య తగ్గిపోతుంది. అల్ట్రావయోలెట్ (యూవీ) లైట్ ట్రీట్‌మెంట్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లాంటివి అలోపీసియా చికిత్సకు ఉపకరించే మార్గాలు.