Infant Wins Rs.16 lakhs Plot In Choutuppal Lucky Draw | రూ.500 కూపన్ తో ఏకంగా రూ.16 లక్షల ప్లాట్ ను దక్కించుకుంది పది నెలల వయసున్న చిన్నారి. దింతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రేకుల గదితో పాటు 66 గజాల ప్లాట్ ను విక్రయించేందుకు యజమాని కంచర్ల రామబ్రహ్మం ఎంతో ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో ఆయనకు వినూత్న ఆలోచన వచ్చింది. ప్లాట్ ను విక్రయించేందుకు లక్కీ డ్రా పెట్టారు. ఈ మేరకు 3,600 రూ.500 కూపన్లను ముద్రించారు. ఆ తర్వాత చౌటుప్పల్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చెందిన శంకర్ లక్కీడ్రాలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. తన పేరు మీద అలాగే భార్య, ఇద్దరు కుమార్తెలు పేరు మీద మొత్తం నాలుగు కూపన్లు కొనుగోలు చేశారు.
అనంతరం ఆదివారం చౌటుప్పల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో శంకర్ కుమార్తె 10 నెలల వయసున్న హన్సిక పేరు మీద ఉన్న కూపన్ వచ్చింది. దింతో ఆ చిన్నారికి ప్లాట్ దక్కింది. చిన్నారి కుటుంబ సభ్యులు కోరిన సమయంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ చెపిస్తానని యజమాని స్పష్టం చేశారు. కాగా ఈ లక్కీ డ్రా నిర్వహించడం ద్వారా మార్కెట్ విలువ కంటే సుమారు రూ.3 లక్షలు అధికంగానే యజమానికి లాభం వచ్చింది.









