India wins maiden Women’s World Cup | 47 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెర పడింది. మగువల తెగువతో ప్రపంచ కప్పు భారత్ కు కైవసం అయ్యింది. ఆదివారం నవీ ముంబయిలో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన టీం ఇండియా విశ్వవిజేతగా అవతరించింది.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్ సాధించిన తర్వాత దేశంలో క్రికెట్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు మహిళలు కూడా విశ్వవిజేతలుగా నిలవడంతో దేశంలోని మహిళలు, యువతులు క్రికెట్ పై మరింత మక్కువను పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2005, 2017లో మిథాలీ రాజ్ సారథ్యంలో ఫైనల్స్ వరకు వెళ్లిన టీం ఇండియా ఓటమిపాలయ్యింది. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడవ సారి ఫైనల్స్ లో అడుగుపెట్టి అదిరిపోయే విజయాన్ని టీం ఇండియా కైవసం చేసుకుంది.
కాగా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంలో టీం ఇండియా పై అంతగా అంచనాలు లేవు. వరుస ఓటములు కలవరపెట్టాయి. అయినప్పటికీ ఏ మాత్రం గుబులు లేకుండా మహిళలు పోరాట పటిమను కనబరిచారు. వరుస విజయాలు, సెమీస్ లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్ లో టీం ఇండియా అడుగుపెట్టింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణిత ఓవర్లలో 298 పరుగులు చేసింది.
ఆ తర్వాత బౌలింగ్ తో సఫారీ జట్టును పీకల్లోతు కష్టాల్లో పడేసి చివరకు 52 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. బ్యాట్ తో 87 పరుగులు, బంతితో రెండు కీలక వికెట్లు పడగొట్టిన షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. వరల్డ్ కప్ లో 215 పరుగులు, 22 వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు.









