Hydra News | దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది ప్రజలకు గోసగా మారింది. ఆఖరుకు అది పోరాటంగా మారింది. మార్గం దొరకక వేలాది మంది అవస్థలు పడుతుంటే..మరికొందరు మాత్రం మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డు గోడలు కట్టేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట – బాచుపల్లి గ్రామాల మధ్య ఈ వివాదం నెలకొంది. మల్లంపేట ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్ కు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతోంది.
కాని దారి మధ్యలో ప్రణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని మల్లంపేట గ్రామప్రజలతో పాటు.. మరో 10 కాలనీల వాసులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 25 వేల మందికి పైగా అవస్థలు పడుతున్నామని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై హైడ్రా పరిశీలన చేసింది. హెచ్ఎండీఏ అనుమతులను పరిశీలించింది. ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని హెచ్ఎండీఏ అనుమతిచ్చిన లే ఔట్ స్పష్టం చేస్తోందని హైడ్రా పేర్కొంది.
రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని.. పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని ఎంతో స్పష్టంగా పేర్కొంది. ఆ క్రమంలోనే అక్కడి ప్రహరీలను హైడ్రా ఇటీవల తొలగించింది.










