- 494 పెయిడ్ యాడ్స్, 129 ప్రొఫైల్స్ బ్లాక్!
– ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మవద్దని సీపీ హెచ్చరిక!
CP Sajjanar Warns On IPL betting | ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న బెట్టింగ్ కేటుగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ‘ఫేక్ ప్రిడిక్షన్’ ఛానెళ్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (VC Sajjanar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
“టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ కొందరు కేటుగాళ్లు అమాయకులను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు” అని సజ్జనార్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల యాక్షన్ ప్లాన్..
ఐపీఎల్ ప్రారంభమైన గడిచిన నెల రోజుల్లోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది. బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్న సుమారు 494 పెయిడ్ ప్రకటనలను పోలీసులు బ్లాక్ చేయించారు.
ఈ మోసపూరిత ప్రకటనలను ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను గుర్తించి వాటిని నిలిపివేసినట్లు సీపీ వెల్లడించారు. టెలిగ్రామ్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో నడుస్తున్న ఫేక్ ఛానెళ్లపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు.
ఒకవేళ మీరు ఇలాంటి ప్రకటనలు చూసినా లేదా బెట్టింగ్ పేరుతో మోసపోయినా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ గారు సూచించారు. క్రికెట్‌ను ఒక క్రీడలాగే ఆస్వాదించాలని, బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.






