Fake residence certificate issued in favour of ‘dog babu’ | ఓ శునకానికి నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు బీహార్ రాష్ట్ర రెవెన్యూ అధికారులు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్నా జిల్లాలోని మసౌర్హి జోన్ లో ఓ వ్యక్తి శునకం పేరిట నివాస ధ్రువీకరణ పత్రం కోసబ్ దరఖాస్తు చేశాడు. దరఖాస్తు పై కుక్క ఫోటో కూడా ఉంది.
కానీ ఇవేవీ గమనించని అధికారులు పత్రాన్ని జారీ చేశారు. దీనిపై మసౌర్హి రెవెన్యూ అధికారి యొక్క డిజిటల్ సంతకం సైతం ఉంది. సదరు పత్రంలో శునకం పేరు డాగ్ బాబు అని ఉండడం గమనార్హం. అలాగే శునకం యొక్క తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పెరు కుథియా బాబు అని పేర్కొన్నారు.
అయితే ఇవేవీ చూడని రెవెన్యూ అధికారులు శునకానికి జులై 24వ తేదీన నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజగా రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు.
ఈ సర్టిఫికెట్ ను జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడిపై, కంప్యూటర్ ఆపరేటర్, పత్రాన్ని జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ సైతం నమోదయ్యింది.









