EC Stops Rythu Bandhu | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆరెస్ కు మరో షాక్ తగిలింది. ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని బీఆరెస్ ప్రభుత్వం యోచించింది.
దానికి ఈ నెల 24న కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.
ఇప్పుడు రైతుబంధు ఇస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న ఫిర్యాదు మేరకు ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రైతు బంధు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వాస్తవానికి తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మూడు లేఖలు రాసింది.
రైతు రుణమాఫీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధు నిధుల జమకు అనుమతి కోరింది. అయితే ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డీఏలు విడుదల చేసేందుకు ఈసీ అనుమతించలేదు.
కానీ రైతుల సాగు పెట్టుబడి సాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రైతుబంధు పథకం అమలుకు ఓకే చెప్పింది.
నవంబర్ 28 కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చునని సూచించింది. అయితే దీనిపై అభ్యంతరాలు రావటంతో రైతు బంధు విషయంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.