Earthquake In Telangana | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ములుగు (Mulugu) జిల్లా కేంద్రంగా బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.
ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో పలు చోట్ల ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక భయభ్రాంతులకు గురయ్యారు.
ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ప్రధానంగా గోదావరి పరివాహాక ప్రాంతంతో పాటుగా.. కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.