Deputy Cm Pawan Kalyan News | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు విద్యుత్ వెలుగులు చూశారని పేర్కొంది ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది.
మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అయిదు నెలల కిందట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం ఆఫీసు తెలిపింది.
తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి పవన్ స్పష్టం చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారని ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారని పవన్ కళ్యాణ్ కార్యాలయం వెల్లడించింది.









