Delimitation JAC meeting In Chennai | కేంద్రంలోని ఎన్డీయే ( NDA ) ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన పై ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరిగి, దక్షిణాది ప్రాతినిధ్యం మాత్రం భారీగా తగ్గుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ పై ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై తమిళనాడులోని డీఎంకే ( DMK ) ప్రభుత్వం తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతుంది.
ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా ముఖ్యమంత్రి స్టాలిన్ ( CM Stalin ) నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆరెస్ ఇతర నేతలు హాజరయ్యారు.
కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్,కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, శిరోమణి అకాలిదళ్ అధ్యక్షుడు బల్వీoధర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. డీలిమిటేషన్ మూలంగా దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయం పై ఈ సదస్సులో చర్చించనున్నట్లు నేతలు స్పష్టం చేశారు.
సౌత్ ఇండియాకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం స్టాలిన్ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.