CP Sajjanar News | హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బుధవారం బషీర్‌బాగ్ లోని పాత కమిషనర్ కార్యాలయంలో అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్ల నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. టెలికాం, ఇంటర్నెట్, ఫుడ్ డెలివరీ, కొరియర్, రవాణా, అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సజ్జనర్ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమాచారం అడిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా ప్రతి సంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా కాకుండా సర్వీస్ ప్రొవైడర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.
ఈ-కామర్స్, కొరియర్ సేవల మాటున గంజాయి, మత్తు పదార్థాలు, నిషిద్ధ వస్తువుల రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయా సంస్థలు పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. అనుమానిత పార్శిల్స్‌ను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్లలో కొంత మంది క్యాబ్, బైక్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు తమ డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.









