Country Chickens Abandoned on Road | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ముల్కనూర్ వైపు వెళ్లే రహదారి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి వేల నాటుకోళ్లను వదిలేసివెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి ఇలా నాటుకోళ్లను వదిలివేయగా, శనివారం తెల్లవారేసరికి ఈ విషయం స్థానికులకు తెలిసింది. ఈ క్రమంలో ముల్కనూర్, ఇందిరా నగర్ గ్రామస్థులు నాటుకోళ్ల కోసం పోటీపడ్డారు.
పంట పొలాల్లో, పొదల్లో నక్కిన నాటుకోళ్లను పట్టుకునేందుకు జనం పరుగులు తీశారు. చేతికి దొరికినన్ని కోళ్లను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. మరికొందరు అయితే సంచుల్లో నింపుకుని మరీ వెళ్లిపోయారు. ఇదే సమయంలో కోళ్లకు ఏదైనా రోగం లేదా వైరస్ సోకిందా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి ఎస్సై కొన్ని కోళ్లను ల్యాబుకు పంపించి టెస్టు చేయించగా ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది. దింతో ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఎల్కతుర్తి రహదారి చుట్టుపక్కల గ్రామాల్లో నాటు కోళ్ల కూర వాసన గుప్పుమంది. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నాటు కోళ్లను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకలేదు. మరి వాటిని పోషించే స్థోమత లేకనా లేదా మరేదైనా కారణం ఉందా అని అనుమానం వ్యక్తం అవుతోంది.









