CM Revanth Welcomes President | భారత రాష్ట్రపతి (President Of India) ప్రతి ఏడాది డిసెంబర్ లో శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వస్తుంటారు.
చాలా ఏళ్లుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శీతాకాల విడిది కోసం మంగళవారం నగరానికి వచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్ సికింద్రాబాద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు.
అంతకు ముందు ఉదయం ఏపీలో ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఏపీలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వచ్చారు.
ఈనెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.