CM Revanth Abroad Tour | తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలిసారి సీఎం హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 2024 జనవరిలో ఆయన స్విట్జర్లాండ్ వెళుతున్నారు.
జనవరి 15-19 తేదీల మధ్య దావోస్ (Davos) వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పాల్గొననున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు.
ఈ సదస్సులో ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.
అంతే కాకుండా తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన పలు సంస్థల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని విజ్ఞప్తి చేయనున్నారు.
ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ (From Lab To Life: Science In Action) అంశంతో ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మన దేశం నుంచి కేంద్ర మంత్రులతో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సైతం ఈ సదస్సులో పాల్గొంటారు.