CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోని నోవాటెల్లో మంగళవారం జరుగుతున్న కాంగ్రెస్ సీఎల్పీ సమావేశానికి వెళ్తున్న క్రమంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఓవర్ వెయిట్ తో లిఫ్ట్ ఆగాల్సిన చోటుకంటే రెండు అడుగులు కిందకు దిగింది. సీఎం అందులోనే ఉండటంతో అందరూ టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్ట్ లో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు. పైఅంతస్తుకు వెళ్లే క్రమంలో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ ఉండాల్సిన స్థానం కంటే కిందికి కుంగిపోయింది. వెంటనే అలారం మోగడంతో అధికారులు, హోటల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన లిఫ్ట్ వద్దకు పరుగులు పెట్టారు. అనంతరం సీఎం సహా అందరినీ లిఫ్ట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది.