Population Census | దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగగణనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం రెండు విడతల్లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్లు గెజిట్ లో పేర్కొంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జనగణన పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. 2027 మార్చి 1 నాటికి మిగిలిన రాష్ట్రాల్లో జన గణన పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. జనగణనతో పాటు కులగణన వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది.
ఈ జనగణన ప్రతి వ్యక్తికి సంబంధించిన సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. ఇందులో కులగణన కూడా నిర్వహించనున్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిర్వహించనున్నారు.
ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు 1.3 లక్షల మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. ఈ జనాభా గణన ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశంలో 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుపుతున్న 8వ జనాభా గణన.