• ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..!
• కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా..!
• నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు
• నేతన్నలకు అర్డర్లు అపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
• వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు
• సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ
KTR Writes Letter To CM Revanth | నేత కార్మిలకు కష్టాలను ప్రస్తావిస్తూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని విమర్శించారు.
లేఖలోని ముఖ్యాంశాలు…. (KTR Writes Letter To CM Revanth)
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి….
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేతరంగం.. మీ కాంగ్రెస్ రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చి నాగులునెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డునపడటంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్ల వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం.. ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో.. ఏదో ఒక రూపంలో తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ మీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం.. వారి మనోస్థయిర్యాన్ని మరింత దెబ్బతీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపైనా కాంగ్రెస్ కున్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది.
రైతాంగ సంక్షోభాన్ని చూసినట్టు నేతన్నల సంక్షోభాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా.. పేద బడుగు, బలహీన వర్గాలైన నేతన్నల కోణంలో ఆలోచించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్రంలోని నేత కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటికే పులువురు కార్మికులు ఆత్మహత్యకు కూడా పాల్పడిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాల అమలు కొనసాగించాలి. అవసరం అయితే మరింత అధనపు సాయం అందేలా చూడాలి కానీ కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో వేల మంది నేతన్నల పొట్ట కొట్టవద్దని కోరుతున్నాను. లేకపోతే.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిశ్రమపై ఆధారపడిన వేల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, మరింత సంక్షోభంలో కూరుపోతారని అవేదనతో తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వేంటనే ఈ అంశంపైన వేగంగా స్పందిచి, నేతన్నలకు అదుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ తరపున కొరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ర్టంలోని బడుగు,బలహీన వర్గాల నేతన్నలు తమ పొట్టకొడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు.