KTR TWEET On Law & Order | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల కాలంలో జరిగిన ఘటనలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ట్వీట్ చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ మహానగర పరిధిలో రెండు దారుణమైన నేరాలు జరిగాయని తెలిపారు. పట్టపగలే ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారనీ, ఇక కూకట్పల్లి పరిధిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురికావడం శోచనీయమన్నారు.
కాంగ్రెస్ హయాంలో పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌరులకు భయం కాదు.. రక్షణ కావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులను రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఉపయోగించడం, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ తన ట్వీట్ తో పేర్కొన్నారు.










