KTR Satires On Congress | బీఆరెస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డ్ సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
గత ఏడాది వరకు రూ. 5, 900 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ అప్పుల కుప్పగా మారుస్తోందన్నారు. ఇదే కాంగ్రెస్ తీసుకువచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అపోహలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం అప్పులు తీసుకోవడంలో రికార్డులు బ్రేక్ చేస్తోందని మండిపడ్డారు.
గత 8 నెలల్లోనే రూ.50 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అది కూడా ఒక్క కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టు లేకుండానే అని విమర్శించారు. ఇదే రన్ రేట్ తో రాబోయే కొన్నేళ్ళల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 నుండి 5 లక్షల కోట్ల అప్పు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని కేటీఆర్ విమర్శించారు.