BRS MLC Kavitha Pressmeet | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా (BJP Telangana New President) మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (N Ramchandar Rao) ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha Kalvakuntla) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గురువారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే ‘రైల్ రోకో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీసీ బిల్లు సాధించేందుకు తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన తెలియజేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన చొరవ తీసుకొని బీజేపీ అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు.
బీసీ బిల్లు కోసం అఖిలపక్షాన్నిన ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించడం లేదని విమర్శించారు కవిత. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు బీసీల కోసం పార్లమెంట్లో ఎన్నడూ మాట్లాడలేదని కవిత విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ మేరకు తాను ఖర్గేకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.









