Saturday 26th April 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ రాజ్యమా.. ఖాకీల రాజ్యమా: కవిత

కాంగ్రెస్ రాజ్యమా.. ఖాకీల రాజ్యమా: కవిత

kalvakuntla kavitha
  • అక్రమ కేసులు పెడితే సహించేదే లేదు… చూస్తూ ఊరుకోబోం
  • బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓర్వలేక కార్యకర్తలపై అక్రమ కేసులు
  • కాంగ్రెస్ కక్షపూరిత వైఖరి ఎక్కువకాలం నిలబడదు
  • ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడుతారు
  • బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాం
  • జగిత్యాల జైలులో ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha | రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా లేదా ఖాకీల రాజ్యమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొంటు అరెస్టయ్యి జగిత్యాల సబ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని గురువారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత గారి వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఉన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్టు చేయించి జైలులో పెట్టించారని ఆరోపించారు.

గతంలో ఎప్పుడు జరగనంత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచ్ ను జైలులో వేయడం దారుణమని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్షపూరిత వైఖరితో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టపరంగానే కాకుండా వీధుల్లో, ప్రజాక్షేత్రంలో తాము ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నామని, ఏ పార్టీ కార్యకర్తలపై అయినా తాము రాజకీయంగా పోరాటం చేశాము తప్పా చట్టాన్ని, పోలీసులను వాడుకొని ఇలా కక్షపూరితంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు.

ఇది కాంగ్రెస్ రాజ్యమా… ఖాకీల రాజ్యమా అన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఉన్నదని తెలిపారు. యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థినులను మహిళా పోలీసులు జుట్టుపట్టి లాగి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో గతంలో ఎప్పుడూ పోలీసులు ఈ రకంగా వ్యవహరించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఒరవడి ప్రారంభమైందని, ఇలాంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది కాంగ్రెస్ రాజ్యమా లేదా ఖాకీల రాజ్యమా అన్నట్లు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.

You may also like
smitha sabharwal
‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!
‘MMTS అత్యాచారయత్నం కేసు..యువతి మాటలకు షాకయిన పోలీసులు’
‘తెలంగాణలో జపాన్ వ్యాపార దిగ్గజం భారీ పెట్టుబడులు’
‘సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions